మిట్స్ యూనివర్సిటీలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థుల సందడి

మదనపల్లె: సెప్టెంబర్ 3:మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్, ఫిల్మ్ మేకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను విద్యార్థులు ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణాష్టమి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. శ్రీకృష్ణుడి జీవితం, బోధనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ధర్మం, సత్యం, సమానత్వం వంటి విలువలను ప్రపంచానికి అందించారని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్న పద్ధతుల్లో పండుగలను జరుపుకోవడం భారతీయ సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనమన్నారు.

శ్రీకృష్ణాష్టమి ప్రేమ, భక్తి, ఐకమత్యం, ధర్మం, మానవతా విలువలను ప్రతిబింబిస్తుందని పేర్కొంటూ.. విద్యార్థులు ఇటువంటి వేడుకల్లో పాల్గొనడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని తెలుసుకోవాలని సూచించారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని సాంప్రదాయ నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఉట్టికొట్టడం కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాషా, ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ కో-ఆర్డినేటర్ వై. ప్రదీప్ కుమార్, ఎస్‌ఏసీ కో-కోఆర్డినేటర్ డాక్టర్ నవీన్ కుమార్, ఎఫ్‌ఎంసీ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ రియాజ్ అలీ, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *