గణేష్ మండపాలకు ఆన్లైన్ సింగిల్ విండో ద్వారా సత్వర అనుమతులు

మతసామరస్యం, శాంతి భద్రతలే ప్రథమ ప్రాధాన్యం

మదనపల్లె, సెప్టెంబర్ 03: రాబోయే వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి భక్తులకు, ఉత్సవ సమితి నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ‘సింగిల్ విండో విధానం’ ద్వారా సులభంగా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు.

పోలీస్, ఫైర్, మున్సిపల్, ఎలక్ట్రిక్ మరియు రెవెన్యూ శాఖల అనుమతులన్నీ ఒకేచోట సులభంగా పొందేలా https://ganeshutsav.net/ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందని ఆయన గుర్తుచేశారు.

జిల్లాలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరూ తమ పరిధిలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి గణేష్ మండపాన్ని స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశించారు.

ముఖ్యంగా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తుది అనుమతులు జారీ చేయాలని స్పష్టం చేశారు.

అగ్నిమాపక మరియు విద్యుత్ భద్రతా ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి.

మండపాల ఏర్పాటు వలన సాధారణ ట్రాఫిక్‌కు మరియు ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.

వినాయక నిమజ్జన ఊరేగింపు మార్గాలు, నిమజ్జనం చేసే ప్రదేశాలు, మరియు ఊరేగింపు జరిగే సమయం తేదీల వివరాలను ముందుగానే సమీక్షించాలి.

మండపాల అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి నిర్వాహకులకు సహకరించాలని ఎస్పీ అధికారులకు సూచించారు.

అదే సమయంలో, ఉత్సవాల వేళ కుల మరియు మత సామరస్యానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని కోరారు.

ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *