మదనపల్లె: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం ఆధ్వర్యంలో “ఏఐ యుగంలో సైబర్ భద్రత – ముప్పులు, రక్షణ చర్యలు మరియు కెరీర్ అవకాశాలు” అనే అంశంపై ఒకరోజు అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన నెక్సిన్ఫ్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ సిద్ధు కుందుర్తి హాజరయ్యారు. ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిద్ధు కుందుర్తి మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సైబర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) అభివృద్ధితో సైబర్ నేరాల స్వరూపం మారుతోందని, ఏఐ ఆధారిత ఫిషింగ్ దాడులు, డీప్‌ఫేక్ వీడియోలు, ఆటోమేటెడ్ సైబర్ దాడులు వంటి ముప్పులు పెరుగుతున్నాయని విద్యార్థులకు వివరించారు.
సంస్థల డేటా, కంప్యూటర్ వ్యవస్థలు, నెట్‌వర్క్‌లను సురక్షితంగా ఉంచేందుకు ఆధునిక సైబర్ భద్రతా విధానాలను అనుసరించడం అవసరమన్నారు. ఏఐ సాంకేతికతతో సైబర్ ముప్పులను ముందుగానే గుర్తించడం, నెట్‌వర్క్‌లను నిరంతరం పర్యవేక్షించడం, సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను విశ్లేషించడం, సైబర్ దాడులకు వేగంగా స్పందించడం సాధ్యమవుతుందని వివరించారు.
సైబర్ సెక్యూరిటీ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, క్లౌడ్ సెక్యూరిటీ వంటి అంశాల్లో ప్రాయోగిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, పెనిట్రేషన్ టెస్టర్, సెక్యూరిటీ ఆపరేషన్స్ నిపుణుడు, డిజిటల్ ఫోరెన్సిక్స్ నిపుణుడు, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజినీర్ వంటి విభిన్న ఉద్యోగ అవకాశాలు ఈ రంగంలో ఉన్నాయని తెలిపారు.
విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం నేర్చుకుంటూ, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, అదే సమయంలో నైతిక విలువలు, చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ బ్రహ్మ ప్రకాష్, కోఆర్డినేటర్లు డాక్టర్ కె.పి. మణికందన్, డాక్టర్ కె.సి. మోహన్‌రాజ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



