హంద్రీ–నీవా జలాల్లో ఒక్క చుక్క కూడా వృథా కాకుండా ప్రజలకు అందించాలి: ఎమ్మెల్యే షాజహాన్ బాషా


మదనపల్లె, సెప్టెంబర్ 15: మదనపల్లె మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నియోజకవర్గ స్థాయిలో తాగునీటి సరఫరాపై అధికారులతో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా సమావేశం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్య తలెత్తిన వెంటనే అధికారులు స్పందించి తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
హంద్రీ–నీవా జలాలు వృథా కాకూడదు
మదనపల్లెకు హంద్రీ–నీవా జలాలు రానున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఎక్కడా ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా జలాలను చెరువులకు నింపడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పెన్షనర్ల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి
ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం పెన్షన్ల పరిశీలన, అప్డేషన్కు అవకాశం కల్పించిన నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి పెన్షనర్కు సంబంధించిన వివరాలను పరిశీలించి, అవసరమైన అప్డేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు
మదనపల్లె పట్టణానికి సమీపంలోని గ్రామాల్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారన్న అంశంపై కూడా ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు.
చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లను సంబంధిత పంచాయతీ కార్యదర్శులు గుర్తించి అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు.
