మదనపల్లె, ఆగస్టు 24: (gtvmedia)సామాజిక వివక్షకు వ్యతిరేకంగా, దళిత, గిరిజన ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.
ముందుగా మిషన్ కాంపౌండ్ నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వృత్తి సంఘాల రాష్ట్ర కార్యదర్శి పి. వెంకటరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి సుమారు 80 ఏళ్లు గడుస్తున్నా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, ఆశయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక మేరకు దళిత, గిరిజనులకు కేటాయించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించకుండా పూర్తిస్థాయిలో కేటాయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోనేరు రంగారావు సిఫారసులను అమలు చేసి భూమిలేని ప్రతి దళిత వ్యవసాయ కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి కేటాయించాలని కోరారు.
జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అనేక గ్రామాల్లో స్మశాన వాటికలకు స్థలాలు లేవని తేలిందని తెలిపారు. 1235 జీవోను పక్కాగా అమలు చేసి ప్రతి గ్రామానికి స్మశాన స్థలాలను కేటాయించడంతో పాటు వాటిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజనుల భూములు, స్మశాన వాటికల సమస్యలను గుర్తించి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధీర్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని అనేక దళిత కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు వీధి దీపాల సౌకర్యం కూడా సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత కాలనీల్లో మరణించిన వ్యక్తిని పూడ్చిపెట్టేందుకు కనీసం ఆరు అడుగుల స్థలం కూడా లేని దుస్థితి ఉందన్నారు.
‘సామాజిక శంఖారావం’ కార్యక్రమం ద్వారా జిల్లాలో నేటికీ కొనసాగుతున్న కుల వివక్ష పరిస్థితులను గుర్తించామని తెలిపారు. కొన్ని గ్రామాల్లో దళితులకు క్షౌరం, హెయిర్ కటింగ్ చేయని పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ఇది సామాజిక వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు.
అనంతరం నాయకులు, కార్యకర్తలు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శ్రీనివాసులు, హరిశర్మ, రామాంజులు, నాగరాజు, రామచంద్ర, రమేష్ బాబు, రమణ, నందు, రమణమ్మ, ఓబులమ్మతో పాటు వివిధ దళిత కాలనీలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
