మదనపల్లె, ఆగస్టు 24: (gtvmedia)తనకు చెందాల్సిన నాలుగు పాడి ఆవులు, వాటి దూడలను తిరిగి ఇప్పించాలని కోరుతూ రామసముద్రం మండలం కాప్పల్లి పంచాయతీ గజ్జలవారిపల్లికి చెందిన కళావతమ్మ సోమవారం మదనపల్లె కలెక్టరేట్ ఎదుట న్యాయ పోరాట దీక్షకు పూనుకున్నారు.
కళావతమ్మ తెలిపిన వివరాల మేరకు.. ఆమె భర్త వీరభద్రతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2018లో తమ వ్యవసాయ బోరులో నీరు అడుగంటిపోవడంతో సుమారు రూ.4 లక్షల విలువైన నాలుగు పాడి ఆవులను కాప్పల్లికి చెందిన రాజప్పకు పాలికి ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం తాము కూలి పనుల కోసం బెంగళూరుకు వెళ్లి ఏడాది తర్వాత తిరిగి వచ్చినప్పటికీ ఆవులను తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు.
ఆవులు, వాటి దూడలను తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందని కళావతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆవులు లేకపోవడంతో వాటి ఆధారంగా తీసుకున్న గ్రూపు అప్పులను చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని తెలిపారు.
ఈ సమస్యపై గత ఐదేళ్లుగా అధికారులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో చేసేదిలేక సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపారు.
తన సమస్యపై జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి, తనకు చెందాల్సిన ఆవులు, దూడలను ఇప్పించి న్యాయం చేయాలని కళావతమ్మ కోరుతున్నారు. అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
