16 మందిపై కేసులు.. రూ.1.60 లక్షల జరిమానా
తిరుపతి, ఆగస్టు 28: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా తిరుపతి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 16 మందిని గుర్తించి వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసులను విచారించిన తిరుపతిలోని 1వ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ధనలక్ష్మి 16 మంది వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1.60 లక్షల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వాహనదారుడితో పాటు ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నామని స్పష్టం చేశారు.
మద్యం సేవించి వాహనం నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని, కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు మద్యం సేవించిన అనంతరం వాహనం నడపకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
