జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ జి. బాలకృష్ణ

మదనపల్లె, అక్టోబరు 21: అన్నమయ్య జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ జరుగుతున్న తీరును జనరల్ అబ్జర్వర్ జి. బాలకృష్ణ పరిశీలించారు.

బుధవారం మదనపల్లె మండలం లోని నిమ్మనపల్లె రోడ్డులో జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మదనపల్లె, రాయచోటి, పీలేరు డివిజన్ల జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రిటర్నింగ్ అధికారి (RO), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ARO), హెల్ప్‌డెస్క్ సిబ్బంది పనితీరును పరిశీలించి, పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నిబంధనల ప్రకారం సరైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు. నామినేషన్ పత్రాలను ఎలాంటి తప్పులు లేకుండా సమర్పించేలా అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలన్నారు.
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఏవైనా సందేహాలు తలెత్తితే రిటర్నింగ్ అధికారిని సంప్రదించి తగిన సూచనలు పొందాలని, ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత పాటిస్తూ, అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ లక్ష్మీపతి,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *