రాయచోటి పోలీసులకు అప్పగించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు
తిరుపతి: సెప్టెంబర్ 4: కడప సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ తిరుపతిలో పోలీసులకు పట్టుబడ్డాడు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన వీరారెడ్డిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని రాయచోటి పోలీసులకు అప్పగించారు.
దొంగతనం కేసులో రిమాండ్‌లో ఉన్న వీరారెడ్డి కడప సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. మరో దొంగతనం కేసుకు సంబంధించి పీటీ వారెంట్‌పై పోలీసులు అతడిని రాయచోటికి తీసుకువచ్చారు. విచారణ అనంతరం రాయచోటి కోర్టులో హాజరుపరిచి, తిరిగి కడప జైలుకు తీసుకువచ్చారు.
జైలులోకి వెళ్లే క్రమంలో వీరారెడ్డి పోలీసుల నుంచి తప్పించుకుని పరారైనట్లు సమాచారం. అనంతరం తిరుపతికి చేరుకున్న అతడిని తిరుపతి ఈస్ట్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని రాయచోటి పోలీసులకు సమాచారం అందించారు.
రాయచోటికి చెందిన ఏఎస్ఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ అయాన్ భాష, హోంగార్డు మధుబాబుకు వీరారెడ్డిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అప్పగించారు. అనంతరం వారు ఖైదీని రాయచోటికి తీసుకెళ్లారు.
ఖైదీ తప్పించుకున్న సమయంలో విధుల్లో ఉన్న పోలీసులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయనే ఆందోళన కూడా పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
