కడప జిల్లా: సెప్టెంబర్ 4:కడపలో ఎక్సైజ్ అధికారులు భారీగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు.
వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అధికారులను చూసి నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా, తెల్లటి ప్లాస్టిక్ సంచిలో 9 కిలోల ఎండు గంజాయి గుర్తించారు.
గంజాయితో పాటు ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. నిందితులు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. కిలో రూ.5 వేల చొప్పున 10 కిలోల గంజాయిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఒక కిలో గంజాయిని విక్రయించి, మిగిలిన 9 కిలోలను తరలిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు.
అరెస్టయిన నిందితుల్లో సతీష్ చంద్రపై గతంలోనూ గంజాయి కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు.
