యువతలో విస్తృత అవగాహన కల్పించాలి: ఇన్చార్జి కలెక్టర్ శివ్ నారాయణ శర్మ
మదనపల్లె, ఆగస్టు 10: (gtvmedia)హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే సరైన మార్గమని అన్నమయ్య జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అన్నారు.
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలు, బ్యానర్లను సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు క్షేత్రస్థాయిలో 104 వాహన సేవల ద్వారా యువత, ప్రజలకు హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తామన్నారు.
హెచ్ఐవీ వ్యాప్తి, వ్యాప్తి చెందని మార్గాలు, పరీక్షలు, సలహా సేవలు, టోల్‌ఫ్రీ నంబర్ 1097, ఏఆర్టీ సేవలు, నివారణలో యువత పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, సరైన సమాచారాన్ని చేరవేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో వెంకటేశు, డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రాధికతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
