ట్రాఫిక్ సమస్యకు నిధులు మంజూరు చేయాలి.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పనులు పూర్తి చేయాలి
టమాటా రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి.. బీటీ కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలని డిమాండ్
మదనపల్లె, ఆగస్టు 20: (gtvmedia)అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గళం విప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
మదనపల్లి పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. పట్టణంలో రహదారులపై పెరుగుతున్న రద్దీ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని సభ దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా గత ఏడాది మదనపల్లికి వచ్చిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రూ.20 కోట్లు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొంటూ, నిధులు మంజూరు చేసి పనులను పూర్తి చేయాలని కోరారు.
మదనపల్లి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో టమాటా రైతులు ఉన్న నేపథ్యంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ భాషా ప్రభుత్వాన్ని కోరారు. ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు పంటను నిల్వ చేసుకునే, విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే మదనపల్లిలోని బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోరారు. మదనపల్లి ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలను మరింత విస్తరించేందుకు ఈ చర్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ భాషా కోరారు.
