మదనపల్లె, ఆగస్టు 27: (gtvmedia)తప్పులు లేని స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా అన్నమయ్య జిల్లాలో SIR ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా SIR స్పెషల్ అబ్జర్వర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న SIR ప్రక్రియను పరిశీలించేందుకు గురువారం మదనపల్లెకు వచ్చిన ఆయన పట్టణంలోని GRT హైస్కూల్, పప్పిరెడ్డిపల్లి పురపాలక ప్రాథమిక పాఠశాలల్లోని 16/164, 89/164, 93/164 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలను పరిశీలించి, మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు తదితర వివరాలకు సంబంధించిన ఫారాలను తనిఖీ చేశారు.
ఒకే ఇంటి నంబర్‌కు అధిక సంఖ్యలో ఓటర్లు నమోదై ఉన్నారా, ఫొటోలు లేని ఓటర్ల వివరాలు ఉన్నాయా వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న వివరాలను మరోసారి ధ్రువీకరించాలని అధికారులకు సూచించారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ నాటికి ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా జాబితాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని స్పష్టం చేశారు.
పట్టణ ఆరోగ్య కేంద్రం తనిఖీ
అనంతరం మదనపల్లె త్యాగరాజు వీధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను డాక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో రోజువారీ ఓపీ, ఐపీ సేవలు, ల్యాబొరేటరీ పరీక్షలు, రోగుల అడ్మిషన్లు తదితర అంశాలపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అందుబాటులో ఉన్న సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాసులు, డీసీహెచ్ఎస్ లక్ష్మీప్రసాద్, రెవెన్యూ అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
