విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే ఊరుకునేది లేదు

మదనపల్లె, ఆగస్టు 20: (gtvmedia)“మార్పు రావాలి.. మార్పు కావాలి..” అనే నినాదంతో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో మదనపల్లె కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విద్యారంగ విధానాలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి కె. మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖను సక్రమంగా నిర్వహించలేని నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు.

బి.టి. కళాశాలకు యూనివర్సిటీ స్థాయి కల్పించాలని, మదనపల్లె మెడికల్ కళాశాలను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను వెంటనే పునఃప్రారంభించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపక పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.

అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ వసతి గృహాలకు నిధులు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేసే విధానాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు.

“విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఏఐఎస్ఎఫ్ చూస్తూ ఊరుకోదు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తాం. అవసరమైతే ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు” అని మాధవ్ హెచ్చరించారు.

విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఐక్యం చేసి మరింత ఉధృతమైన ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఏఐఎస్ఎఫ్ నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు తరుణ్, నవ్య, విష్ణు, వినయ్, మస్తాన్, సిరి, విశాల్, గౌతమ్, కిరణ్, మొహమ్మద్ ఆసిఫ్, మనోజ్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *