అనధికార లేఔట్లను గుర్తించి.. క్రమబద్ధీకరించండి

మదనపల్లె, ఆగస్టు 20: (gtvmedia)అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అన్నమయ్య ఉడా) పరిధిలో ఉన్న మండలాల్లో అనధికార లేఔట్లను గుర్తించి, వాటిని క్రమబద్ధీకరించేలా చర్యలు చేపట్టాలని అన్నమయ్య ఉడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు.

గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో అన్నమయ్య ఉడా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన అన్నమయ్య ఉడా పరిధిలో 25 మండలాలు, 448 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇంజినీరింగ్ అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

అన్నమయ్య ఉడా పరిధిలోని మండలాల వారీగా అనధికార లేఔట్లను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. ఆయా మండలాల ఎంపీడీవోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, గుర్తింపు లేని లేఔట్ల వివరాలతో నివేదికలు సమర్పించాలని సూచించారు.

అనధికార లేఔట్లను గుర్తించిన అనంతరం నిబంధనల ప్రకారం వాటి క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు జేసీ సూచించారు. అదే సమయంలో ఉడా పరిధిలో భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మౌలిక వసతులు, ఇంజినీరింగ్ పనులకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో అన్నమయ్య ఉడా కార్యాలయ కార్యదర్శి మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *