ప్రాణాలకు తెగించి సమాజాన్ని రక్షిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి: కలెక్టర్, ఎస్పీ.
మదనపల్లె,అక్టోబర్ 21: సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ, ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయని పోలీసుల సేవలు చిరస్మరణీయమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం మదనపల్లెలోని బీటీ కళాశాల పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని, దేశవ్యాప్తంగా అమరులైన 154 మంది, జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన 9 మంది పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ స్మృతి పరేడ్‌కు పరేడ్ కమాండర్‌గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ యు. రంగనాథ్ బాబు వ్యవహరించారు.
అన్నమయ్య జిల్లా పోలీసులు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి ఎలాంటి కష్టమొచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో భాగంగా, దేశవ్యాప్తంగా అమరులైన 154 మంది పోలీసుల పేర్లను అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు చదివి వినిపించారు. అనంతరం పరేడ్ మైదానం నుంచి అనిబిసెంట్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కలిసి కలెక్టర్ నిశాంత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సాయుధ బలగాలు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థినీ విద్యార్థులు ఇతర అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు యు. రంగనాథ్ బాబు, కె. సురేష్ కుమార్ రెడ్డి, ఎం.రవికుమార్, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది మరియు మృతి చెందిన పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

