అమరావతి, ఆగస్టు 13:( gtvmedia)డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఉద్దేశంతో రాయితీపై ఈ-ఆటోలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా మహిళలు ఉపాధి పొందడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తోంది.
ఈ-ఆటో విలువ సుమారు రూ.4.5 లక్షలు కాగా, ప్రభుత్వం రూ.లక్ష వరకు రాయితీ అందించనున్నట్లు సమాచారం. మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణంగా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నగరాలు, పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ-ఆటోల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే డ్వాక్రా మహిళలు, వారి కుటుంబ సభ్యులు సంబంధిత మెప్మా అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.
