105 మంది సిబ్బందితో ముమ్మర తనిఖీలు.. 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం
అన్నమయ్య జిల్లా, ఆగస్టు 8: (gtvmedia)డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా కురబలకోట మండలం అంగళ్లు ప్రాంతంలో తెల్లవారుజామున ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, మదనపల్లె డీఎస్పీ శ్రీ ఎం. బుచ్చిరాజు నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. మిట్స్, విశ్వం ఇంజనీరింగ్ కళాశాలల పరిసరాల్లోని పీజీ హాస్టళ్లు, అద్దె ఇళ్లలో మొత్తం 105 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా డ్రోన్ కెమెరాలతో పరిసర ప్రాంతాల్లో గగనతల నిఘా ఏర్పాటు చేశారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనుమానితులకు నిర్వహించిన 53 డ్రగ్స్ పరీక్షల్లో అన్నీ నెగిటివ్గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యువత, స్థానికులతో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు.
డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, ఈగల్ టీమ్ సభ్యులు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

