మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎన్సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్ల సెలెక్షన్స్ నిర్వహించి, ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతికి చెందిన 11(ఎ) ఎయిర్ స్క్వాడ్రన్ (టి) ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ ఆర్.జె. అత్రే యూనివర్సిటీని సందర్శించి, ఇంటర్వ్యూ మరియు విద్యా ప్రతిభ ఆధారంగా ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో మొత్తం 50 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, మొత్తం 15 మంది విద్యార్థులు ఎన్సీసీ ఎయిర్‌వింగ్‌లో చేరేందుకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో గ్రూప్ కెప్టెన్ ఆర్.జె. అత్రే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రమశిక్షణ, అంకితభావం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యార్థులు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతో పాటు దేశసేవా భావాన్ని అలవర్చుకోవాలని, భారత సాయుధ దళాలు, రక్షణ రంగాల్లోని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తమిళనాడులోని తాంబరం, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో నిర్వహించిన ఆల్ ఇండియా వాయు సైనిక్ క్యాంప్ (AIVSC)–2026లో పాల్గొని ప్రతిభ కనబరిచిన మిట్స్ ఎన్సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తిని పెంపొందించడంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నూతనంగా ఎంపికైన క్యాడెట్లను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఎయిర్‌వింగ్ వారెంట్ ఆఫీసర్ మనోహర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి. కమల్ బాషా, ఎన్సీసీ ఎయిర్‌వింగ్ కేర్‌టేకర్ అధికారి డాక్టర్ చరణ్ కుచి మరియు క్యాడెట్ విద్యార్థులు పాల్గొన్నారు.


