రామసముద్రం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా రామసముద్రం మండల కూటమి నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. రామసముద్రంలోని దుర్గమ్మ ఆలయం వద్ద జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ, రామసముద్రం మండలంలోని ప్రతి ఎంపీటీసీ స్థానంతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కూటమి విజయానికి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఐక్యత కీలకమని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

