గ్రీన్‌మెట్రిక్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌–2026లో మిట్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా 704వ స్థానం.. భారత్‌లో 29వ ర్యాంకు

మదనపల్లె: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్‌) డీమ్డ్ టు బి యూనివర్సిటీకి యూఐ గ్రీన్‌మెట్రిక్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌–2026లో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఫౌండర్‌ అండ్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఎన్‌. విజయ భాస్కర్‌ చౌదరి వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత ప్రాంగణాల అభివృద్ధి, ఇంధన పొదుపు, సహజ వనరుల సమర్థ వినియోగం, వ్యర్థాల నిర్వహణ, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాల ఆధారంగా నిర్వహించిన ఈ ర్యాంకింగ్స్‌లో పాల్గొన్న 2,016 విద్యాసంస్థల్లో మిట్స్‌ 704వ స్థానాన్ని సాధించింది. ఆసియాలో 1,620 విద్యాసంస్థల్లో 419వ స్థానం, భారత్‌లో పాల్గొన్న 68 విద్యాసంస్థల్లో 29వ స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 110 దేశాలకు చెందిన విద్యాసంస్థలు ఈ ర్యాంకింగ్స్‌లో పాల్గొన్నాయి.

పర్యావరణహిత కార్యక్రమాలకు ప్రాధాన్యం

యూనివర్సిటీ ప్రాంగణంలో పచ్చదనాన్ని పెంపొందించడం, సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నీరు సహా సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించడం, వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఛాన్సలర్‌ తెలిపారు.

విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంపొందించే లక్ష్యంతో నీటి నిర్వహణ వ్యవస్థలు, సౌరశక్తి వినియోగం, వ్యర్థాల నిర్వహణ, విద్యుత్‌ వాహనాల రూపకల్పన వంటి పర్యావరణహిత సాంకేతిక ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు నీటి సంరక్షణ, స్వచ్ఛమైన ఇంధన వినియోగం, కాలుష్య నియంత్రణకు దోహదపడటంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ అంతర్జాతీయ గుర్తింపు యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమిష్టి కృషికి లభించిన ప్రోత్సాహమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రో ఛాన్సలర్‌ ఎన్‌. ద్వారకానాథ్‌, వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ సి. యువరాజ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ డి. ప్రదీప్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. రామనాథన్‌, డైరెక్టర్‌–అడ్మిషన్స్‌ డాక్టర్‌ దీపాంకర్‌ రాయ్‌, అసిస్టెంట్‌ డీన్‌–అక్రిడిటేషన్స్‌ డాక్టర్‌ ఏ.వి. పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *