మదనపల్లె,అక్టోబర్ 8:పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న రహదారి నిర్మాణ పనులపై మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పట్టణంలోని సీటీఎం రోడ్డు, కదిరి రోడ్డు ప్రాంతాల్లో నూతనంగా చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనుల నాణ్యత, పాటిస్తున్న నిర్మాణ ప్రమాణాలు, పనుల పురోగతిపై సంబంధిత అధికారులను ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా రోడ్డు పనుల కారణంగా ప్రజలు, వాహనదారులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
పట్టణంలో పెరుగుతున్న రాకపోకలకు అనుగుణంగా రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.

