మదనపల్లిలో డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

మదనపల్లి, జూలై 27: (gtvmedia)భారతరత్న, మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, ‘మిసైల్ మ్యాన్’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని మదనపల్లిలోని పలు విద్యాసంస్థల్లో ఘనంగా నివాళులర్పించారు.

మదనపల్లె జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఉన్న డా. అబ్దుల్ కలాం విగ్రహానికి సోమవారం “వెల్ విషర్స్” స్వచ్ఛంద సంస్థ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలాం జీవిత విశేషాలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా వెల్ విషర్స్ సంస్థ నిర్వాహకులు గిరీష్ మాట్లాడుతూ, డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఈ తరం చూసిన అత్యంత మహోన్నత వ్యక్తుల్లో ఒకరని అన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందాలనే ఉద్దేశంతో దాదాపు పదేళ్ల క్రితం జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

‘మిసైల్ మ్యాన్’గా దేశానికి అపూర్వ సేవలు అందించిన కలాం జీవితం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పెద్ద కలలు కనాలని, వాటిని సాధించేందుకు కృషి చేయాలనే కలాం సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వెల్ విషర్స్ సభ్యులు అరుణ్, ఖాసిఫ్, మహేష్, వెంకటరమణ నాయుడు, లక్ష్మీపతి, జ్ఞానేంద్ర, కేశవ, జీవన్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *