లక్ష కోట్లతో 10 జిల్లాల్లో గ్లోబల్ హార్టికల్చర్ హబ్
మదనపల్లెలో రిలయన్స్ ఆధ్వర్యంలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’
ఆంధ్రా కోడలిగా రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఉద్ఘాటన
మదనపల్లె, అక్టోబర్ 2:
మహాత్మా గాంధీ, ‘జై జవాన్ జై కిసాన్’ అని నినదించిన లాల్ బహదూర్ శాస్త్రిల స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో రాయలసీమను ‘రత్నాలసీమ’గా మారుస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఉద్ఘాటించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మదనపల్లెలో ఏర్పాటు చేసిన రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎడారిలాంటి నేలలోనూ వర్షాభావ పరిస్థితులను తట్టుకుని అద్భుతమైన పంటలు పండిస్తున్న రాయలసీమ రైతుల దృఢ సంకల్పాన్ని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు.
రైతు సంక్షేమమే కేంద్రం లక్ష్యం
రైతుల జీవనాధారాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని నిర్మల సీతారామన్ వివరించారు. రైతుల చేతి ఖర్చుల కోసం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నామన్నారు. సకాలంలో పంట పెట్టుబడి కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నామని తెలిపారు. కోవిడ్ సంక్షోభం, ప్రస్తుత మిడిల్ ఈస్ట్ యుద్ధం వంటి ప్రతికూల పరిస్థితుల వల్ల యూరియా రవాణాకు ఆటంకాలు ఏర్పడి, ఒక్కో బస్తా ధర రూ. 3,000 వరకు చేరినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం రూ. 2,700 సబ్సిడీ భరిస్తూ రైతులకు కేవలం రూ. 300లకే అందిస్తోందని స్పష్టం చేశారు. రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోకూడదని ప్రధాని మోదీ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. వాతావరణ మార్పులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే 192 రకాల కొత్త విత్తనాలను సైంటిఫిక్ పద్ధతిలో అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. అంతేకాకుండా గోబర్ధన్ స్కీమ్ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి, పీఎం కుసుమ్ యోజన కింద ఉచిత సోలార్ పంపుల పంపిణీ, పంట నష్టపోకుండా కిసాన్ ఇన్సూరెన్స్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. పాడి రైతులు, మత్స్యకారుల కోసం ప్రతి జిల్లాలో సంచార పశువైద్యశాలలను (మొబైల్ వెటర్నరీ క్లినిక్స్) ఏర్పాటు చేశామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు, పక్కనే ఉన్న మరో 2 జిల్లాలను కలుపుకుని మొత్తం 10 జిల్లాల్లో ‘హార్టికల్చర్ హబ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ (ADB) లాంటి అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సహకారంతో, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి ఈ ప్రాంతాన్ని ‘వరల్డ్ బెస్ట్ ప్రొడక్షన్ సెంటర్’గా మార్చబోతున్నామన్నారు.
‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటు గర్వకారణం
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను, ఏఐ (AI) ని ఉపయోగించి రిలయన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ISB) తరహాలో మదనపల్లెలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ను ఏర్పాటు చేస్తుండటం దేశానికే గర్వకారణమని నిర్మల సీతారామన్ సంతోషం వ్యక్తం చేశారు. రాయలసీమ రైతుల కష్టపడే తత్వాన్ని చూసే ఇంతటి భారీ కార్పొరేట్ సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఇక్కడికి వచ్చిన కార్పొరేట్ ప్రతినిధి ఎంతో వినయంగా ‘నన్ను ఆంధ్రాకి ఒక బిడ్డగా తీసుకోండి’ అని అడగడం ఆనందంగా ఉందన్నారు.
నేను ఆంధ్రా కోడలిని..
“నేను ఆంధ్రా కోడలిని. ఆంధ్రా కోడలిగా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడాలనిపిస్తుంది. రాయలసీమ అభివృద్ధి పట్ల నాకు ప్రత్యేకమైన పట్టుదల ఉంది. గుజరాత్ నుంచి వచ్చిన మోదీ గారు సైతం ‘నన్ను ఆంధ్రప్రదేశ్ కు ఒక కొడుకుగా తీసుకోండి’ అని చెప్పడం, ఆయనకు ఈ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం” అని నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎప్పుడు కలిసినా రాయలసీమ రైతుల కష్టాలు చెబుతూ, ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలని కోరుతుంటారని.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో రాయలసీమ రైతుల జీవితాల్లో మార్పు తథ్యమని ఆమె భరోసా ఇచ్చారు.
