డీఎస్సీ ఆరోపణలపై సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు?: పెద్దిరెడ్డి

లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలి

మదనపల్లె, ఆగస్టు 8: (gtvmedia)డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మదనపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి,తంబళ్లపల్లె MLA ద్వారకనాథరెడ్డి, మాజీ MLA తిప్పారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై అభ్యర్థులు, నిరుద్యోగ యువతలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం వాటికి స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై సమగ్ర విచారణ జరిపించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

అక్రమాలపై ఆరోపణలు ఎదురవుతున్న నేపథ్యంలో విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా వ్యవహరిస్తే స్వతంత్ర దర్యాప్తుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

నీట్ పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అంశాన్ని ప్రస్తావించిన పెద్దిరెడ్డి, రాష్ట్రంలో డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

“డీఎస్సీ నియామకాలు, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఎంపికలపై అభ్యర్థులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా వ్యవహరిస్తే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడాలి? లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి స్వతంత్ర దర్యాప్తును ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి” అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా నిష్పాక్షిక విచారణ చేపట్టాలని ఆయన కోరారు.

రిలే నిరాహార దీక్షల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *