మదనపల్లి,సెప్టెంబర్ 26:మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎన్సీసీ క్యాడెట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.


చిత్తూరు 35(ఏ) ఆంధ్ర బెటాలియన్‌కు చెందిన ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్. దీపక్ సింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథం ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ ఎంపికలు జరిగాయి.
ఈ ఎంపికలకు బీటెక్ మొదటి సంవత్సరం నుంచి 78 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు దేహదారుఢ్య పరీక్షలు, పరుగు పందేలు తదితర పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 38 మంది విద్యార్థులను ఎన్సీసీ క్యాడెట్లుగా ఎంపిక చేశారు. వీరిలో 12 మంది బాలికలు, 26 మంది బాలురు ఉన్నారు.
ఎన్సీసీ క్యాడెట్ల ఎంపిక ప్రక్రియకు సహాయ సహకారాలు అందించిన చిత్తూరు 35(ఏ) ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి. మోనిష్, ఎన్సీసీ విభాగం, కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ తదితరులకు మిట్స్ యూనివర్సిటీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
ఎంపికైన క్యాడెట్లను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్‌తో పాటు అధ్యాపకులు అభినందించారు.
