భవిత పిల్లలకు సేవ చేయడం దైవ సేవతో సమానం

ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల అభివృద్ధికి ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం: రాటకొండ గురుప్రసాద్

మదనపల్లె, సెప్టెంబర్ 30:
భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు విద్య, శిక్షణతో పాటు మానసిక వికాసానికి సేవలందించడం దైవ సేవతో సమానమని ఎస్వీ యూనివర్సిటీ పాలకమండలి మాజీ సభ్యుడు రాతకొండ గురుప్రసాద్ పేర్కొన్నారు.

మదనపల్లె పట్టణంలోని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో బుధవారం 30 మంది మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓ)కు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గురుప్రసాద్ మాట్లాడుతూ భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల మానసిక, విద్యా మరియు సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, విద్యా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో ఎంఈఓలు, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భవిత కేంద్రాల్లో చిన్నారులకు నిరంతరం సేవలందిస్తున్న ఉపాధ్యాయులు వారి విద్యాభివృద్ధితో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు చేస్తున్న కృషి ఎంతో ముఖ్యమైనదని అన్నారు.

గర్భిణుల్లో పౌష్టికాహార లోపం, మేనరిక వివాహాల కారణంగా కొన్ని సందర్భాల్లో పిల్లల్లో ఆరోగ్య, అభివృద్ధి సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముందస్తు జాగ్రత్తలు, వైద్యపరమైన సూచనలు పాటించడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చని సూచించారు.

భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులను ఓర్పుతో, ఆప్యాయతతో తీర్చిదిద్దుతూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. విద్యతో పాటు పిల్లలలో సామాజిక నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఐఈఆర్టీ కోఆర్డినేటర్ జనార్ధన్, ఎంఈఓ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డిశేఖర్, ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *