సెప్టెంబర్ 15 వరకు అవకాశం: డీఈఓ డాక్టర్ కే. సుబ్రహ్మణ్యం
మదనపల్లి, ఆగస్టు 12: (gtvmedia)ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈ విద్యా సంవత్సరానికి అందిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కే. సుబ్రహ్మణ్యం తెలిపారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ ఎలాంటి అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, అనంతరం సమీపంలోని ఓపెన్ స్కూల్ కేంద్రంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి ప్రవేశం పొందాలని సూచించారు.
పదో తరగతి ప్రవేశాలకు అభ్యర్థికి కనీసం 14 సంవత్సరాల వయస్సు పూర్తై ఉండాలని తెలిపారు. ప్రవేశ సమయంలో టీసీ లేదా రికార్డ్ షీట్, విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులైతే వైద్య ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు.
అలాగే విద్యార్థికి చదవడం, రాయడం వచ్చునని ధ్రువీకరించే సర్టిఫికెట్‌తో నేరుగా పదో తరగతిలో ప్రవేశం పొందే అవకాశం కూడా ఉందని డీఈఓ తెలిపారు.
ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణుడై ఉండాలని ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పొందే సర్టిఫికెట్లు రెగ్యులర్ విద్యార్థులు పొందే సర్టిఫికెట్లతో సమానమైన విలువను కలిగి ఉంటాయని, వాటి ఆధారంగా తదుపరి ఉన్నత విద్య కోసం కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చని ఆయన తెలిపారు.
