మదనపల్లె, జూలై 28: (gtvmedia)అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో, గుర్రంకొండ మండలానికి చెందిన ఓ గంజాయి విక్రేతపై పీటీ ఎన్‌డీపీఎస్ (PT NDPS) యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు జిల్లా పోలీసు శాఖ తెలిపింది.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి వెల్లడించిన వివరాల మేరకు, గుర్రంకొండ మండల కేంద్రానికి చెందిన ముబారక్ కుమారుడు కే. ఆదిల్ గత కొన్నేళ్లుగా గంజాయిని అక్రమంగా రవాణా చేసి, గుర్రంకొండ, మదనపల్లె ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆదిల్‌పై ఇప్పటికే ఐదు ఎన్‌డీపీఎస్ కేసులు నమోదయ్యాయని, ఆయా కేసుల్లో మొత్తం 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదనంగా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వేధింపులు, ఘర్షణలకు పాల్పడటం వంటి వివిధ ఆరోపణలపై మరో ఐదు కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
మొత్తం పది కేసులు నమోదై, తరచూ నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఆదిల్‌పై పీటీ ఎన్‌డీపీఎస్ యాక్ట్ నమోదు చేయాలని జిల్లా ఎస్పీకి ప్రతిపాదనలు పంపారు. దస్త్రాలను పరిశీలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు పోలీసు శాఖ పేర్కొంది.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా నుంచి ఉత్తర్వులు అందిన అనంతరం గుర్రంకొండ పోలీసులు ఆదిల్‌ను అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించిన సాంకేతిక నివేదికను సమగ్రంగా సిద్ధం చేసిన వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డిని జిల్లా ఎస్పీ అభినందించారు.
