మదనపల్లె, సెప్టెంబర్ 16: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓజోన్ పొర పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.


కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ఓజోన్ పొర పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక కాలంలో పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణ మార్పులు ఓజోన్ పొరపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాలను ఓజోన్ పొర శోషించడంతో భూమిపై జీవరాశులకు రక్షణ లభిస్తుందని వివరించారు. ఓజోన్ పొర పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణహిత చర్యలను పాటించాలని పిలుపునిచ్చారు.
ఓజోన్ పొరను దెబ్బతీసే క్లోరోఫ్లోరోకార్బన్లు (CFCs) వంటి పదార్థాల వినియోగాన్ని నియంత్రించేందుకు అంతర్జాతీయంగా చర్యలు చేపట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన పెంచుకుని, సమాజంలో కూడా చైతన్యం తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ రంజిత్ భాస్కరన్, అసిస్టెంట్ డీన్–ఫస్ట్ ఇయర్ బీ.టెక్ డాక్టర్ చంద్ర మోహన్, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
