మిట్స్‌లో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు

సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి: శిరీష బండపల్లి

మదనపల్లె, సెప్టెంబర్ 15: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (MITS) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ASCE) సహకారంతో ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలమనేరు మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శిరీష బండపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, డీన్–స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సనత్ హెగ్డే, ముఖ్య అతిథి శిరీష బండపల్లి తదితరులు భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సమాజ అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకం

ఈ సందర్భంగా శిరీష బండపల్లి మాట్లాడుతూ.. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న దేశవ్యాప్తంగా ఇంజినీర్స్ డే జరుపుకోవడం గర్వకారణమన్నారు. ఇంజినీరింగ్ రంగంలో విశేష ప్రతిభ కనబరిచి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుడు విశ్వేశ్వరయ్య అని కొనియాడారు.

సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు కేవలం ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా కాకుండా, తమ సాంకేతిక పరిజ్ఞానంతో సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపి సానుకూల మార్పు తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

పర్యావరణ ఇంజినీరింగ్ ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చే మార్గాలను అన్వేషించవచ్చని, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ ద్వారా ట్రాఫిక్ సమస్యలకు మెరుగైన పరిష్కారాలను అందించవచ్చని తెలిపారు. అర్బన్ ప్లానింగ్ ద్వారా పార్కులు, రహదారులు, నీటి వనరులు, ఇతర ప్రజా సౌకర్యాలను సమర్థవంతంగా ప్రణాళిక చేసి మెరుగైన నగరాల అభివృద్ధికి సివిల్ ఇంజినీర్లు కీలక పాత్ర పోషించగలరన్నారు.

సాంకేతికత పెరిగినా సివిల్ ఇంజినీర్ల అవసరం తప్పదు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికతలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ నిర్మాణాల భద్రత, స్థిరత్వం, నిర్మాణ సామర్థ్యం, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ వంటి కీలక అంశాల్లో సివిల్ ఇంజినీర్ల నైపుణ్యం ఎప్పటికీ అవసరమేనని శిరీష బండపల్లి పేర్కొన్నారు.

సివిల్ ఇంజినీరింగ్‌లో కోర్ రంగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వేలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మున్సిపల్ పరిపాలన, నీటి వనరులు, రవాణా, పట్టణ ప్రణాళిక, పర్యావరణం, రక్షణ రంగం, పరిశ్రమలు, పరిశోధన, ఉన్నత విద్య వంటి అనేక రంగాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు.

“ఏ ఉద్యోగం వస్తుంది?” అనే ఆలోచనకు బదులుగా “సమాజంలో నేను ఎలాంటి మార్పు తీసుకురాగలను?” అనే దృక్పథంతో విద్యార్థులు తమ కెరీర్‌ను నిర్మించుకోవాలి అని ఆమె సూచించారు.

అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడం ద్వారా సివిల్ ఇంజినీర్లు సమాజ అభివృద్ధికి గణనీయమైన సేవలు అందించగలరని తెలిపారు.

కార్యక్రమంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ విజయకుమార్ నటేశన్, కోఆర్డినేటర్ డాక్టర్ సుధీర్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *