సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పట్టుబడిన రూ.1.25 లక్షల నగదు

మదనపల్లె, ఆగస్టు 24: (gtvmedia)మదనపల్లె సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో కడప ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో సీఐ నాగరాజుతో పాటు 14 మంది సిబ్బంది కార్యాలయంలోకి వెళ్లి తలుపులు మూసివేసి సోదాలు చేపట్టారు.

కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది వద్ద ఉన్న నగదును ఏసీబీ అధికారులు లెక్కించారు. సబ్‌రిజిస్టర్ గురుస్వామికి చెందిన బీరువాలో ఉన్న రూ.20 వేల అనధికార నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులు, ఈసీలకు చెల్లించిన నగదు, స్టాంపుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సీతారామారావు మాట్లాడుతూ సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో మొత్తం రూ.1.25 లక్షల నగదు గుర్తించామని తెలిపారు. ఇందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన నగదు ఎంత, అనధికారికంగా ఉన్న నగదు ఎంత అనే వివరాలను లెక్కిస్తున్నామని వెల్లడించారు.

అనధికారికంగా వసూలు చేసిన నగదుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు కూడా నివేదికలు పంపుతామని డీఎస్పీ తెలిపారు.

మదనపల్లె సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి, లంచాల వసూళ్లపై గతంలోనూ ఫిర్యాదులు రావడం, గత పదేళ్లలో ఐదుసార్లకు పైగా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *