అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
మదనపల్లె, సెప్టెంబర్ 2: (gtvmedia)రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రాత్రి వేళల్లో అక్కడే బస చేస్తున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్థులతో నేరుగా సమావేశమై వారి సమస్యలు, భద్రతా అవసరాలు, గ్రామాల్లోని శాంతిభద్రతల పరిస్థితిపై చర్చిస్తున్నారు. ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేయడంతో పాటు భరోసా కల్పించడమే ‘పల్లె నిద్ర’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసు అధికారులు తెలిపారు.
మహిళల భద్రత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, దొంగతనాల నివారణ, బాల్య వివాహాల కట్టడి తదితర అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లోకి అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు వచ్చినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపడుతున్న పోలీసులు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.

గ్రామాల్లో రాత్రి వేళల్లో పోలీసులు బస చేస్తుండటంతో ప్రజల్లో భద్రతా భావన పెంపొందడంతో పాటు పోలీసు–ప్రజల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్నాయి.
