మంగినపూడి సముద్ర తీరంలో ఘనంగా మహా గణపతి ఉత్సవాలు.. 630 కిలోల లడ్డూ ప్రత్యేక ఆకర్షణ
మచిలీపట్నం: భారతదేశ చరిత్రలో మచిలీపట్నానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా మంగినపూడి సముద్ర తీరంలో నిర్వహించనున్న 63 అడుగుల మహా సాగర విజయ గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయని మచిలీపట్నం జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు తెలిపారు.
బందరు వాసిగా ఈ మహా గణపతి ఉత్సవాలు నిర్వహించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 63 అడుగుల ఎత్తుతో రూపొందుతున్న మహా విజయ గణపతి విగ్రహానికి వివిధ పవిత్ర ప్రదేశాల నుంచి సేకరించిన మట్టిని వినియోగించామని తెలిపారు. మహా గణపతితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రముఖ ఆలయాల నమూనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రోజుకు లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నట్లు గడ్డం రాజు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ హోమాలు, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రాజేంద్ర పర్యవేక్షణలో భారీ విగ్రహ నిర్మాణం
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాల రూపకల్పనలో పనిచేసే శిల్పి రాజేంద్ర పర్యవేక్షణలో మంగినిపూడి బీచ్‌లో ఈ భారీ గణపతి విగ్రహాన్ని రూపొందించినట్లు గడ్డం రాజు తెలిపారు. ఇప్పటికే ఈ భారీ విగ్రహం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు.
విగ్రహ నిర్మాణం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన 10 మంది కార్మికులు తొలుత భారీ ఇనుప ఫ్రేమ్‌ను సిద్ధం చేశారని తెలిపారు. అనంతరం బిహార్‌కు చెందిన 20 మంది కార్మికులు మట్టితో గణపతి విగ్రహానికి రూపుదిద్దారని చెప్పారు. శిల్పి రాజేంద్ర నేతృత్వంలో మట్టి విగ్రహ నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
విగ్రహానికి ఆర్గానిక్ రంగులు అద్దేందుకు బెంగాల్ నుంచి 15 మంది కార్మికులను రప్పించినట్లు పేర్కొన్నారు. ఎండ, వర్షాల నుంచి విగ్రహాన్ని రక్షించేందుకు 80 అడుగుల ఇనుప రేకుల షెడ్‌ను ఏర్పాటు చేశామని, సముద్ర గాలులను తట్టుకునేలా షెడ్‌ను 10 బలమైన రోప్స్‌తో అనుసంధానించినట్లు వివరించారు.
వేలాది మంది భక్తుల భాగస్వామ్యం
మహా గణపతి విగ్రహ నిర్మాణానికి అవసరమైన మట్టిని అందించాలని పిలుపునివ్వడంతో వేలాది మంది భక్తులు ఈ పుణ్యకార్యంలో భాగస్వాములయ్యారని గడ్డం రాజు తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా 630 కిలోల మహా గణపతి ప్రసాదం లడ్డూ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెప్పారు. బందరు లడ్డూ ద్వారా మరోసారి మచిలీపట్నం ప్రత్యేకత చాటుకోనుందని పేర్కొన్నారు.
‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా షూటింగ్ జ్ఞాపకం
మచిలీపట్నంలో జరిగిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా చిత్రీకరణ సందర్భంగా భారీ వినాయకుడి ఉత్సవాన్ని మచిలీపట్నం వీధుల్లో నిర్వహిస్తూ పాటను చిత్రీకరించిన విషయాన్ని గడ్డం రాజు గుర్తు చేశారు.
63 అడుగుల మహా సాగర విజయ గణపతి ఉత్సవాల ద్వారా మచిలీపట్నం పేరు చరిత్రలో ప్రత్యేకంగా నిలవాలని, ఈ ఉత్సవాలు బందరుకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
