“క్షణాల్లో స్పందించారు.. ప్రాణం నిలిపారు! వెలిగల్లు డ్యామ్ వద్ద యువతిని కాపాడిన గాలివీడు పోలీసులు”

అన్నమయ్య జిల్లా: సెప్టెంబర్ 12 ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న ఓ యువతిని గాలివీడు పోలీసులు సకాలంలో స్పందించి రక్షించారు. పోలీసుల సమయస్ఫూర్తి, చొరవతో యువతి ప్రాణాపాయం నుంచి బయటపడింది.

శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో గాలివీడు పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ జె. నరసింహారెడ్డి విధుల్లో ఉండగా, రాయచోటి టౌన్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేశారు. తన కుమార్తె వెలిగల్లు డ్యామ్ వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఫోన్ ద్వారా సమాచారం అందిందని, వెంటనే ఆమెను కాపాడాలని కోరారు.

విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ నరసింహారెడ్డి సిబ్బందితో కలిసి హుటాహుటిన వెలిగల్లు డ్యామ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్యకు సిద్ధమవుతున్న యువతిని గుర్తించి, చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా కాపాడారు. అనంతరం ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు.

యువతిని సముదాయించిన ఎస్‌ఐ, ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తన పిన్ని గతంలో తనతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, అయితే ఇటీవల తనతో మాట్లాడకుండా ముఖం తిప్పుకుని, ఇకపై మాట్లాడనని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు యువతి కన్నీటిపర్యంతమై తెలిపింది. ఆ బాధను తట్టుకోలేకే వెలిగల్లు డ్యామ్ వద్దకు వచ్చినట్లు చెప్పింది.

ఈ సందర్భంగా పోలీసులు యువతికి కౌన్సెలింగ్ నిర్వహించి, చిన్న చిన్న సమస్యలకు జీవితాన్ని ముగించుకోవడం పరిష్కారం కాదని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని, జీవితంపై ధైర్యంతో ముందుకు సాగాలని మనోధైర్యం కల్పించారు.

అనంతరం యువతి బంధువులకు సమాచారం అందించి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. అనంతరం యువతిని వారి సంరక్షణకు సురక్షితంగా అప్పగించారు.

పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు

సమాచారం అందిన వెంటనే స్పందించి, బాధ్యతాయుతంగా వ్యవహరించి యువతి ప్రాణాలను కాపాడిన గాలివీడు ఎస్‌ఐ జె. నరసింహారెడ్డి, పోలీసు సిబ్బందిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ అభినందించారు.

ప్రజల ప్రాణ రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, ఆపదలో ఉన్నవారు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *