తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ సిద్ధమవుతోంది. బ్రహ్మోత్సవాలకు ముందుగా నిర్వహించే అంకురార్పణ ఘట్టం రేపు వైభవంగా జరగనుంది.
బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టే ప్రక్రియలో భాగంగా రేపు సాయంత్రం శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు మాడవీధుల్లో విహరించనున్నారు. అనంతరం రాత్రి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించనున్నారు.
అంకురార్పణ అనంతరం ఎల్లుండి మధ్యాహ్నం శ్రీవారి పరివార దేవతలు, గరుడ పఠం మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎల్లుండి రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్దశేష వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ సేవతో బ్రహ్మోత్సవ వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలిరానున్నారు.
