మదనపల్లెలో నకిలీ క్లినిక్‌లపై ఉక్కుపాదం మోపాలి

అక్రమంగా మందుల విక్రయాలపై చర్యలు తీసుకోవాలి.. బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్

మదనపల్లె, సెప్టెంబర్ 9: మదనపల్లె పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అనధికారిక ప్రైవేట్ క్లినిక్‌లు, నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులకు ఆయన వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ.. ఎలాంటి అర్హతలు, అనుమతులు లేకుండా కొన్ని క్లినిక్‌లు నిర్వహిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా యాంటీబయోటిక్స్, షెడ్యూల్-హెచ్ ఔషధాలను అనుమతులు లేకుండా విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ్వరం, బీపీ, షుగర్ వంటి సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేట్ క్లినిక్‌లు, దళారులు ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

మదనపల్లె ప్రాంతంలో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి అనధికారిక క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహించాలని, అక్రమంగా మందుల విక్రయాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పునీత్ కుమార్ డిమాండ్ చేశారు. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతను పరిష్కరించి పేదలకు అవసరమైన వైద్యం, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *