దళితుల భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

మదనపల్లె, ఆగస్టు 31:( gtvmedia)తంబళ్లపల్లె మండలం ఎద్దుల వేమన్నగారిపల్లె పరిధిలోని సర్వే నంబర్ 828-Bలో దళితుల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా దళితులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచే కోటాల గ్రామంలోని సర్వే నంబర్ 828-Bలో 2.5 ఎకరాల భూమిని దళితుల ఇళ్ల కోసం కేటాయించారని తెలిపారు. అనంతరం 1980లలో మరో 1.5 ఎకరాల భూమిని సేకరించి దళితుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు.

ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో కొంత భూమి బీడు భూమిగా మారిందని, అదే ప్రాంతంలో దళితులు రామస్వామి, మారెమ్మ ఆలయాలను నిర్మించుకుని పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే ఆ భూములను తమ భూముల్లో కలిపేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తూ దళితుల ఇళ్ల స్థలాలను ఆక్రమించడంతో పాటు మారెమ్మ ఆలయ నిర్మాణానికి కూడా ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా కులం పేరుతో దూషిస్తూ దళిత యువతపై దాడులకు పాల్పడుతున్నారని, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తంబళ్లపల్లె ఎస్‌ఐకి ఫిర్యాదు చేసినప్పటికీ బాధితులకు న్యాయం చేయకుండా ఆక్రమణదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని శ్రీనివాసులు ఆరోపించారు. బాధితుల ఫోన్లు లాక్కోవడానికి కూడా ప్రయత్నించారని పేర్కొన్నారు.

దళితుల భూములను ఆక్రమించి, వారిపై దాడులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధుసూదన్‌పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని, దళితుల ఇళ్ల స్థలాలు, ఆలయ భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా నిలవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వెంకటాచలపతి, పూడి శ్రీనివాసులు, గంగాద్రి, వెంకటేశు, రాజశేఖర, రమణ, చిన్న నాగన్న, కదిరిప్ప, శివ, చిన్న రమణప్ప, రమణమ్మ, రత్నమ్మ, అరుణమ్మ, రెడ్డమ్మ, నాగమ్మ, వేమనారాయణ, వేమన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *