నేపాల్‌లో వరద బీభత్సం.. 675కు చేరిన మృతుల సంఖ్య

2,400 మంది ఆచూకీ గల్లంతు.. 4,450 మందిని రక్షించిన భద్రతా బలగాలు

పునర్నిర్మాణానికి 5 బిలియన్ డాలర్లు అవసరం.. అంతర్జాతీయ సాయం కోరిన ప్రభుత్వం

కాఠ్మాండు: నేపాల్‌ను భారీ వరదలు, కొండచరియలు అతలాకుతలం చేశాయి. ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 675కు చేరింది. మరో 2,400 మంది వరకు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. బురద, శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు భద్రతా బలగాలు, రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.

ఇప్పటివరకు 4,450 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. రక్షించిన వారిలో 187 మంది విదేశీయులు ఉన్నట్లు వెల్లడించారు. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్ జిల్లాలు వరదల ప్రభావానికి తీవ్రంగా గురయ్యాయి.

పునర్నిర్మాణానికి రూ.42 వేల కోట్లకు పైగా..

వరదల కారణంగా నేపాల్ మౌలిక వసతులు, ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. దేశాన్ని పునర్నిర్మించేందుకు సుమారు 4 నుంచి 5 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఆ దేశ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.33 వేల కోట్ల నుంచి రూ.42 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మొత్తం దేశ జీడీపీలో దాదాపు పదో వంతుకు సమానమని ఆయన పేర్కొన్నారు.

నష్ట తీవ్రతపై తుది అంచనాలు రూపొందిస్తున్నామని, 2015 భూకంపంతో పోలిస్తే ఈసారి పునర్నిర్మాణ వ్యయం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

రంగంలోకి అంతర్జాతీయ సహాయక బృందాలు

విపత్తు తీవ్రత దృష్ట్యా నేపాల్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని సాయం కోరింది. టన్నెల్స్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత్‌కు చెందిన 11 మంది నిపుణుల సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. భారత్ ఇప్పటికే 57 టన్నుల నిత్యావసర, సహాయక సామగ్రిని నేపాల్‌కు తరలించింది.

చైనా నుంచి ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం రానుండగా.. జపాన్, ఆస్ట్రేలియా నుంచి కూడా సహాయక సామగ్రి చేరుతోంది. ధ్వంసమైన రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ కేంద్రాలతో పాటు ఇతర మౌలిక వసతుల నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

విదేశీ పర్యాటకుల కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్

బాధితుల్లో విదేశీ పర్యాటకులు కూడా ఉండటంతో నేపాల్ విదేశాంగ శాఖ ప్రత్యేక ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. మృతుల గుర్తింపు, బాధిత కుటుంబాలతో సమన్వయం, విదేశీయులను వారి స్వదేశాలకు పంపే ప్రక్రియలను ఈ విభాగం పర్యవేక్షిస్తోంది.

‘అంతర్జాతీయ సాయాన్ని తిరస్కరించలేదు’

అంతర్జాతీయ సాయాన్ని నేపాల్ ప్రభుత్వం తిరస్కరించిందంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. పునర్నిర్మాణానికి ప్రపంచ దేశాల మద్దతు అవసరమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న నిర్ధారణ లేని లెక్కలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలను కోరింది. విరాళాలను నేరుగా ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి జమ చేయాలని విజ్ఞప్తి చేసింది.

320 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత విదేశాంగ శాఖ వివరాల ప్రకారం 320 మంది భారతీయుల ఆచూకీ ఇంకా లభించలేదు. చైనా వైపు దాదాపు 400 మంది చిక్కుకుపోగా, వారిలో 153 మంది సురక్షితంగా నేపాల్ చేరుకున్నారు.

త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా కాపాడాయి. కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి ఉంటారని భావిస్తున్న దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తులు ఇంకా సంప్రదింపులకు అందుబాటులోకి రాలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.

చైనాపై మాజీ మంత్రి ఆరోపణలు

ఇదిలా ఉండగా, నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలపై మాజీ మంత్రి మాధవ్ ప్రసాద్ చౌలాగైన్ చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. సరిహద్దుల్లో భారీ విపత్తు ముంచుకొస్తున్నప్పటికీ చైనా ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.

బుధవారం ఉదయం సుమారు 8:40 గంటల సమయంలో నేపాల్-టిబెట్ సరిహద్దు వైపు నుంచి మంచు, బండరాళ్లు, బురదతో కూడిన భారీ ప్రవాహం నేపాల్‌పై విరుచుకుపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై అధికారికంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *