పత్రికా ప్రకటన

తేదీ: 31-07-2026
స్థలం: మదనపల్లె( gtvmedia)

ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: USFI

శ్రీ చైతన్య తపస్య స్కూల్‌తో పాటు పలు విద్యాసంస్థలపై వచ్చిన ఫిర్యాదులను విచారించాలని డిమాండ్

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొళ్లబైలు పంచాయతీ పరిధిలోని శ్రీ చైతన్య తపస్య విద్యాసంస్థలో సుమారు 300–400 మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI) రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి డిమాండ్ చేశారు.

ఈ అంశంపై జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట USFI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీమతి ఉషారాణికి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 48 రోజులు గడిచినా, సంబంధిత విద్యార్థుల UDISE నమోదు, హాజరు వివరాలపై స్పష్టత లేదని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి హాజరు నమోదు విద్యా రికార్డులు, తదుపరి తరగతులకు ప్రమోషన్, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలకు కీలకమని తెలిపారు.

అలాగే, విద్యార్థుల నుంచి అడ్మిషన్ ఫీజులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం తదితర పేర్లతో భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

మదనపల్లె కేంద్రంగా నడుస్తున్న పలు ప్లే స్కూల్లు కూడా ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వహించబడుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఒక్కో విద్యార్థి నుంచి రూ.45 వేల నుంచి రూ.60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ప్లే స్కూల్లు కూడా ప్రభుత్వ అనుమతులు పొందాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, వాటి అమలుపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

రాయచోటి ప్రాంతంలోని ఫ్యూచర్ ON, డెక్కన్ స్కూల్, కలికిరిలోని తపస్య స్కూల్, విజయవాణి స్కూల్ తదితర విద్యాసంస్థల్లో కూడా UDISE నమోదు, ప్రభుత్వ అనుమతులు మరియు ఇతర నిబంధనల అమలుపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని USFI డిమాండ్ చేసింది.

అదేవిధంగా ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా. కే. సుబ్రమణ్యం పాత్రపై ప్రభుత్వం స్వతంత్ర విచారణ జరిపి, బాధ్యతలు నిర్ధారించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది.

ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా USFI ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించింది.

ఈ కార్యక్రమంలో USFI జిల్లా నాయకులు కమలాకర్, గణేష్, ఆఫ్రిద్, యువరాజ్, ప్రేమ్, యాసిన్ పాల్గొన్నారు.

అభినందనలతో,
కమలాకర్, ఆఫ్రిద్
USFI జిల్లా నాయకులు

ఆరోపణలు USFI విడుదల చేసిన పత్రికా ప్రకటన ఆధారంగా ప్రచురించబడుతున్నాయి. సంబంధిత విద్యాసంస్థలు లేదా విద్యాశాఖ అధికారుల స్పందన అందిన వెంటనే ప్రచురిస్తాము.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *