పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కె.వి.పల్లె, ఆగస్టు 28: (gtvmedia)రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. శుక్రవారం పీలేరు నియోజకవర్గంలోని కె.వి.పల్లె పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు.

జిల్లాలో మారుమూల పోలీస్ స్టేషన్‌గా ఉన్న కె.వి.పల్లె పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించిన ఎస్పీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై సీఐకి పలు సూచనలు చేశారు.

రౌడీషీటర్లను ముందస్తుగా బైండోవర్ చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికి సంబంధించిన నివేదికలను ఉన్నతాధికారులకు పంపాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచుతూ, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ముఖ్యంగా మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాత్రి గస్తీని ముమ్మరం చేయడంతో పాటు పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లో పోలీసుల ఉనికిని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

అనంతరం పోలీస్ సిబ్బంది యోగక్షేమాలను ఎస్పీ ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో కలకడ సీఐ బి. లక్ష్మన్న, ఎస్ఐ శివకుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *