యుద్ధ ప్రాతిపదికన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు శాండ్ రింగ్ బండ్ ఏర్పాటు చేయాలి

వైసీపీ ఇంచార్జ్ ఎస్. నిసార్ అహమ్మద్

మదనపల్లె, ఆగస్టు 28: (gtvmedia)మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ ఎస్. నిసార్ అహమ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్యాంక్‌కు తక్షణమే శాండ్ రింగ్ బండ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని కోరారు.

పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు నీరు వచ్చిన వెంటనే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు నీటిని మళ్లించేలా అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆయన సూచించారు. అలాగే చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి విడుదలయ్యే నీరు వృథా కాకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో ఎంత నీటిని నిల్వ చేయవచ్చో, ప్రస్తుతం ఎన్ని పనులు పూర్తయ్యాయో, ఇంకా ఎలాంటి పనులు మిగిలి ఉన్నాయో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని కోరారు. మదనపల్లె పట్టణానికి ప్రస్తుతం సరఫరా అవుతున్న తాగునీరు ఎంత ఎంఎల్‌డీ, పట్టణానికి అవసరమైన నీరు ఎంత ఎంఎల్‌డీ, ఎంత లోటు ఉందనే అంశాలపై సమగ్ర వాటర్ ఆడిట్ నిర్వహించి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

మదనపల్లె భవిష్యత్ జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక తాగునీటి ప్రణాళికను రూపొందించాలని నాయకులు కోరారు. ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, నీరు వచ్చే అవకాశం ఉన్న సమయంలో దాన్ని నిల్వ చేసుకునే మౌలిక వసతులు సిద్ధంగా లేకపోవడం ప్రజల పట్ల నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి మదనపల్లె ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాసులు, గుండ్లూరు రఫీక్, సలీం, ఈశ్వర్ నాయక్, సుధాకర్, నాయకులు యూనస్, బయ్యా రెడ్డి, కొత్తపల్లి మహేష్, మాధవ రెడ్డి, సోషల్ మీడియా జిల్లా కార్యదర్శి ఆవుల సోమశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి, జి.వి. ప్రసాద్, ఎన్. నవాజ్ అలీ ఖాన్, తాజ్ భాషా, నూర్ మొహమ్మద్ ఖాన్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, బొమ్మిశెట్టి మధు, రాజేశ్, ఆవుల విశ్వనాథ్, జాఫర్, రియాజ్, శారదా రెడ్డి, మంజుల, నాగమణి, వినుతబాయి, శ్రీకాంత్ రెడ్డి, మహేశ్ రెడ్డి, షేక్ జబి, ముజీబ్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *