విద్యా హక్కు చట్టం 23(1) సవరించాలి.. టెట్ నిబంధన రద్దు చేయాలి

మదనపల్లెలో యూటీఎఫ్ నిరసన.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్

మదనపల్లె, ఆగస్టు 25: (gtvmedia)2010కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు టెట్ అర్హతను తప్పనిసరి చేసే నిబంధనను తొలగించేందుకు విద్యా హక్కు చట్టం 23(1)ను సవరించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న స్పెషల్ టెట్‌లో పలు సవరణలు చేయాలని కోరినప్పటికీ, జనరల్ టెట్ తరహాలోనే నోటిఫికేషన్ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం మదనపల్లె డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబిర్, అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, హేమలత మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందే నియామకం పొందిన ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత సాధించాలనే నిబంధన విధించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఉపాధ్యాయుల భయాందోళనలను తొలగించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఎన్‌సీటీఈ అధికారులతో చర్చించి చట్ట సవరణకు కృషి చేయాలని కోరారు.

చట్ట సవరణ సాధ్యం కాని పక్షంలో స్పెషల్ టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని, అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఉపాధ్యాయులకు అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ప్రస్తుతం బోధిస్తున్న సబ్జెక్టులకు పరిమితం చేస్తూ సిలబస్‌ను రూపొందించాలని కోరారు.

తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడంతో పాటు, సెప్టెంబర్ 4 నుంచి ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకుంటామని యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు.

నిరసన అనంతరం అన్నమయ్య జిల్లా డీఈఓకు యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు పురం వెంకటరమణ, ఆదినారాయణ, విజయ్‌కుమార్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సుధాకర్ నాయుడు, వివిధ మండలాల నాయకులు అంజద్, వెంకటరమణ, పయని ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *