సిద్ధవటం, ఆగస్టు 19: (gtvmedia)వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటంలోని ప్రసిద్ధ సిద్ధవటేశ్వర శివాలయంలో ధ్వజస్తంభం తొలగింపు, నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు చేపట్టిన తవ్వకాల్లో పురాతన రాగి నాణేలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం రెండో రోజు తవ్వకాలు కొనసాగుతుండగా మరికొన్ని రాగి నాణేలు బయటపడటంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.
పెన్నా నది తీర ప్రాంతంలో ఉన్న చారిత్రక సిద్ధవటేశ్వర ఆలయంలో ధ్వజస్తంభాన్ని నూతనంగా ఏర్పాటు చేసేందుకు కూలీలతో తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో పురాతనంగా కనిపిస్తున్న కొన్ని రాగి నాణేలు లభ్యమయ్యాయి.
ఈ విషయంపై శ్రీశైలం దేవస్థానం ఏఈఈ రమేష్ మాట్లాడుతూ.. నూతన ధ్వజస్తంభం ఏర్పాటులో భాగంగా రెండో రోజు తవ్వకాలు చేపట్టగా రాగి నాణేలు లభించాయని తెలిపారు. లభించిన నాణేలను శ్రీశైలం దేవస్థానం ట్రస్టుకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.
నాణేల కాలం, వాటి చారిత్రక ప్రాధాన్యతపై పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పురాతన ఆలయ ప్రాంగణంలో తవ్వకాల్లో నాణేలు లభించడంతో భక్తులు, స్థానికులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రవీణ్ శర్మ, స్థానిక పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
