రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం.. జాతీయ స్థాయికి ఎంపిక
మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు సైకిల్ పోలో క్రీడలో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. బ్రహ్మచారి తెలిపారు.
ధర్మవరంలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైకిల్ పోలో టోర్నమెంట్‌లో అన్నమయ్య జిల్లా జట్టు తరఫున కళాశాలకు చెందిన నవ్యశ్రీ, అఖిల, సురేఖ, స్రవంతి పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో నెల్లూరు జిల్లా జట్టుపై విజయం సాధించి తమ ప్రతిభను చాటారు. ఈ విజయంతో నలుగురు విద్యార్థినులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. బ్రహ్మచారి మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర వికాసంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, సమయపాలన, జట్టుగా పనిచేసే నైపుణ్యం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు.
విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థినులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడం కళాశాలకు గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థినులు క్రీడల్లో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదిగేలా కళాశాల తరఫున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినులను వ్యాయామ అధ్యాపకురాలు స్వప్న, కళాశాల అధ్యాపకులు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు, అన్నమయ్య జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
