సీఎం పర్యటనకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలి

మదనపల్లె, సెప్టెంబర్ 27:

అక్టోబర్ 2న మదనపల్లెకు రానున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆదివారం మదనపల్లె చంద్రకాలనీ, బీకేపల్లి, వెన్నెల రెస్టారెంట్ వెనుక ప్రాంతాల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సీఎం పర్యటన సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను మరోమారు పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

సభా ప్రాంగణంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియాకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. పార్కింగ్, బారికేడ్లు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

జిల్లా ఎస్పీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రజల రాకపోకలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో పీలేరు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *