మదనపల్లి ప్రజల తాగునీటి సమస్యపై వైసీపీ నేత నిస్సార్ అహ్మద్ విమర్శలు
మదనపల్లి, ఆగస్టు 21: (gtvmedia)మదనపల్లి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు చేపట్టిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ మదనపల్లి ఇన్చార్జి నిస్సార్ అహ్మద్ విమర్శించారు.
శుక్రవారం చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ప్రాంతాన్ని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జింక చలపతితో కలిసి వైసీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న మొరవ పనులను పరిశీలించి ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.
2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మదనపల్లికి హంద్రీ–నీవా కాలువ కోసం శంకుస్థాపన చేశారని నిస్సార్ అహ్మద్ గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో మదనపల్లికి రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మంజూరయ్యాయని తెలిపారు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లు గడిచినా కనీసం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయించలేకపోయిందని విమర్శించారు. కుప్పంకు తాగునీటిని తరలించేందుకు రూ.600 కోట్లతో లైనింగ్ పనులు చేపట్టిన ప్రభుత్వం.. మదనపల్లి తాగునీటి అవసరాలకు నిధుల విషయంలో పక్షపాతం చూపుతోందని ఆరోపించారు.
సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి మదనపల్లి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని నిస్సార్ అహ్మద్ డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
