ఏపీలో గంజాయి సమాచారం ఇస్తే నగదు రివార్డు

గంజాయి సేవించే వారి సమాచారం ఇస్తే రూ.1,500.. విక్రయాలు, అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే రూ.5,000

విజయవాడ: మత్తు పదార్థాల నిర్మూలన, యువతను డ్రగ్స్‌ బారిన పడకుండా కాపాడే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ‘ఈగల్ ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గంజాయి సేవిస్తున్న వారి గురించి పోలీసులకు సమాచారం అందిస్తే రూ.1,500 నగదు బహుమతి అందించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రకటించారు. గంజాయి సహా మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 రివార్డు అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈగల్ బృందాలు కూడా పోలీసులతో కలిసి పనిచేయనున్నాయి. ఇప్పటికే 1,287 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి యువతను రక్షించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

యువతను లక్ష్యంగా చేసుకుని దళారులు, వ్యాపారులు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘాను మరింత పెంచనున్నారు.

మత్తు పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని సూచించారు.

మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *