విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
గత వారం రోజులుగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు తగ్గిపోవడం, నదుల్లో నీటి లభ్యత తగ్గడం, రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు విద్యుత్ వినియోగం పెరగడంతో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో లేకపోవడం కూడా అంతరాయాలకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.
సాధారణంగా పగటి సమయంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉండగా, రాత్రి వేళల్లో జలవిద్యుత్‌తో పాటు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ద్వారా డిమాండ్‌ను తీర్చేందుకు ప్రయత్నిస్తారు. అయితే ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడటంతో విద్యుత్ వ్యవస్థపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది.
విద్యుత్ ఫ్రీక్వెన్సీ ఎందుకు ముఖ్యమంటే..
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను సమన్వయం చేసే కంట్రోల్ వ్యవస్థ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం మధ్య సమతుల్యతను నిరంతరం పర్యవేక్షిస్తుంది. విద్యుత్ గ్రిడ్‌లో సాధారణంగా 50 హెర్ట్జ్ (Hz) ఫ్రీక్వెన్సీను స్థిరంగా కొనసాగించడం అత్యంత కీలకం.
విద్యుత్ ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువైనప్పుడు ఫ్రీక్వెన్సీ పడిపోయే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఉత్పత్తి, వినియోగం మధ్య తీవ్ర అసమతుల్యత ఏర్పడితే గ్రిడ్ స్థిరత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది.
అటువంటి పరిస్థితుల్లో విద్యుత్ వ్యవస్థను రక్షించేందుకు అధికారులు ముందస్తుగా లోడ్ రిలీఫ్ (LR) చర్యలు చేపడతారు. అంటే కొంత ప్రాంతంలో తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి, గ్రిడ్‌పై ఉన్న భారాన్ని తగ్గిస్తారు. పరిస్థితి అదుపులోకి వచ్చి ఫ్రీక్వెన్సీ స్థిరపడిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారు.
విద్యుత్ గ్రిడ్‌లో పెద్ద స్థాయిలో అంతరాయం ఏర్పడితే వ్యవస్థను తిరిగి పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల విద్యుత్ వ్యవస్థను కాపాడేందుకు అధికారులు 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
వినియోగదారులు సహకరించాలి
ప్రస్తుతం రాత్రి వేళల్లో చోటుచేసుకుంటున్న విద్యుత్ అంతరాయాలు ఉద్దేశపూర్వకంగా కాకుండా విద్యుత్ డిమాండ్–ఉత్పత్తి మధ్య ఏర్పడుతున్న వ్యత్యాసం, గ్రిడ్‌ను స్థిరంగా ఉంచాల్సిన అవసరం వల్ల చోటుచేసుకుంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
విద్యుత్ వినియోగదారులు ఈ పరిస్థితిని అర్థం చేసుకుని అనవసరమైన విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
