సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఆకస్మిక తనిఖీలో ఎమ్మెల్యే షాజహాన్ భాష
మదనపల్లె, సెప్టెంబర్ 10: కొత్త పెన్షన్ల నమోదును సకాలంలో పూర్తి చేసి అర్హులైన పేదలకు ప్రయోజనం అందేలా సచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచించారు. గురువారం మదనపల్లె పట్టణంలోని ఒకటో, రెండో వార్డు పరిధిలోని సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది హాజరు పట్టికను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యాలయంలో అందుబాటులో ఉన్న సిబ్బంది పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. విధులకు సంబంధించి నిర్లక్ష్యం కనిపించిన సిబ్బందిపై మున్సిపల్ కమిషనర్‌కు మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సచివాలయాల్లో జరుగుతున్న కొత్త పెన్షన్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులు, అర్జీలను సిబ్బంది స్వీకరిస్తున్న తీరును తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త పెన్షన్లు అందించేందుకు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందేలా సచివాలయ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కొత్త పెన్షన్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలన్నారు.
వార్డుల్లోని టీడీపీ నాయకులు కూడా ప్రజల నుంచి వచ్చే విన్నపాలు, అర్జీలను సంబంధిత సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి కొత్త పెన్షన్ల నమోదు ప్రక్రియలో సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో రెండో వార్డు ఇన్‌చార్జ్ రఘుపతి నాయుడు, శ్రీనివాసులు, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, మల్లికార్జున్ నాయుడు, డాన్స్ రెడ్డప్ప, మంగల ప్రభాకర్, కాశి శ్రీరామ్, మా భాష తదితరులు పాల్గొన్నారు.
